శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాస జాతర, బోనాల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మాజీ కౌన్సిలర్ సోందాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో పాల్గొని భక్తులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు. అలాగే హెచ్సీయూ డిపో సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను వైభవంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో కూడా అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.





