శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణే లక్ష్యంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు సమీపంలో గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు బండారు మోహన్ ముదిరాజ్, స్థానిక నాయకులు, గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ ఒక్క మొక్క ఎన్నో ప్రాణాలకు ఆధారం, ప్రకృతి మన సంపద, పరిరక్షణ మన బాధ్యత అని అన్నారు. నగరానికి చెరువులు గొప్ప వరమని, వాటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని సూచించారు.

పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. చెరువుల చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతోపాటు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. గుర్నాధం చెరువు పరిరక్షణ కోసం కాలనీవాసులు, గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించిన శ్రీకాంత్, చెరువులో మురుగు నీరు కలవకుండా చర్యలు తీసుకోవడం, పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సూచించారు. ప్రజల సహకారంతోనే చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, లోకేష్, రమేష్, కె.ఎస్. బాబు, శ్రీనివాస్, పాండు, చైతన్, రామ్, శ్రీనివాస్ రెడ్డి, గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.





