శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వైశాలి నగర్ సమీప రైల్వే అండర్‌పాస్ వద్ద ఇటీవల జరిగిన నాలా ప్రమాదంలో గల్లంతైన ప్రేమ్‌నగర్ బి బ్లాక్ కాలనీకి చెందిన బాలయ్య (70) కుటుంబాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరామర్శించారు. కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంఘీభావం తెలిపారు.

బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా ఎమ్మెల్యే గాంధీ రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులకు బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.





