శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్స్ కాలనీలో కార్నర్ స్టోన్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో రూ.6.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కార్నర్ స్టోన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) కీలకమని పేర్కొన్నారు. గాయత్రి ఎస్టేట్స్ కాలనీలో ఆధునిక సౌకర్యాలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఆరోగ్యవంతమైన శేరిలింగంపల్లి నిర్మాణమే తన లక్ష్యమని, ప్రతి కాలనీ, ప్రతి పార్కులో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాలనీవాసులు ప్రతిరోజూ వ్యాయామం చేసేందుకు, వృద్ధులు, పిల్లలు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయం గడిపేందుకు ఇటువంటి జిమ్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నానని, మియాపూర్ డివిజన్‌తోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో కార్నర్ స్టోన్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఎస్‌ఆర్ ప్రతినిధులు కిరణ్, ఉషారాణి, భార్గవి, పవన్, తేజ్ కుమార్, నిర్మల, హరి చైతన్య, మంజుల, శ్రీకాంత్, శ్రీనివాసరావు, నికిత, జన్య ఫౌండేషన్ ప్రతినిధులు సురేంద్ర, చిరంజీవి, నాయకులు ప్రతాప్ రెడ్డి, ఉదయ్ కిరణ్, రవిచంద్ర రెడ్డి, అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





