శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రతి వారం నిర్వహిస్తున్న వాక్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా ఈసారి 15 గుర్తించిన ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మొత్తం 17.95 కిలోమీటర్ల పరిధిలో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 313 ఆక్రమణలను తొలగించి రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రజా ప్రదేశాలను తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. శేరిలింగంపల్లి జోన్లో నార్సింగిలో 30, పటాన్‌చెరు 15, అమీన్‌పూర్ 27, మియాపూర్ 18, శేరిలింగంపల్లిలో 16 మొత్తం కలిపి 8.5 కిలోమీటర్ల పరిధిలో 106 ఆక్రమణలను తొలగించారు. అలాగే కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మాదాపూర్‌లో 22, ఆల్విన్ కాలనీ 11, కూకట్‌పల్లిలో 20 మొత్తం కలిపి 2.6 కిలోమీటర్ల పరిధిలో 53 ఆక్రమణలను తొలగించారు.

కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని చింతల్‌లో 18, జీడిమెట్ల 27, కొంపల్లి 16, గాజుల రామారం 12, నిజాంపేట 42, దుండిగల్ 18, మేడ్చల్ 21 మొత్తం కలిపి 6.85 కిలోమీటర్ల పరిధిలో 154 ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణల తొలగింపుతో పాటు, అదే ప్రాంతాల్లో మళ్లీ అక్రమ ఆక్రమణలు జరగకుండా సీఎంసీ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నాయి. రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రజా ప్రదేశాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయి. పాదచారులకు మెరుగైన సౌకర్యం కల్పించడం, ప్రజా ప్రదేశాలను ఆక్రమణల నుంచి విముక్తంగా ఉంచడం లక్ష్యంగా వాక్ ఫ్రీ కార్యక్రమాన్ని సీఎంసీ పరిధిలో నిరంతరం కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.






