శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని కేఎస్ఆర్ (KSR) లేఅవుట్లో నాసిరకంగా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై TRS ఇన్ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 29న నిర్మించిన తారు రోడ్డు కేవలం 30 రోజుల్లోనే పూర్తిగా ధ్వంసమైందని ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డు పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాధనాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేయడమేనని మండిపడ్డారు. ఇదేనా శేరిలింగంపల్లిలో మీరు చెబుతున్న అభివృద్ధి? అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పలు డిమాండ్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు నాణ్యతను పరిశీలించడంలో విఫలమైన క్వాలిటీ ఇన్స్పెక్షన్ అధికారులతో పాటు నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, సదరు కాంట్రాక్టర్‌కు ఎలాంటి అదనపు నిధులు చెల్లించకుండా అతని సొంత ఖర్చులతోనే రోడ్డును మళ్లీ నిర్మించాలని, ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఒకవేళ కాంట్రాక్టర్ ఇందుకు నిరాకరిస్తే అతని లైసెన్స్‌ను రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మిగిలిన కాంట్రాక్టర్లు రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ స్పష్టం చేశారు.






