నాలాలో గల్లంతైన బాలయ్య కోసం ముమ్మర గాలింపు.. స్వయంగా పర్యవేక్షించిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో ప్రమాదవశాత్తూ నాలాలో గల్లంతైన బాలయ్య (70) ఆచూకీ కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రామకృష్ణ నగర్ కాలనీ పరిధిలో జరుగుతున్న గాలింపు చర్యలను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాస్, సేవా ఇస్లావత్, సీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు, హైడ్రా, పోలీసులు, ట్రాఫిక్, ఎన్డీఆర్ఎఫ్, జలమండలి అధికారులతో కలిసి గాలింపు చర్యల పురోగతిని సమీక్షించారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం చేపడుతున్న చర్యలను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆరెకపూడి గాంధీ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం అర్థరాత్రి రెండు గంటల వరకు నాలా ఔట్‌లెట్లు, చెరువు ఇన్‌లెట్, ఔట్‌లెట్లను స్వయంగా పరిశీలించామని తెలిపారు. ప్రతి మ్యాన్‌హోల్‌ను తనిఖీ చేయడంతోపాటు కెమెరాల సాయంతోనూ గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను నిరంతరం కొనసాగిస్తామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. గల్లంతైన వ్యక్తిని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక వనరులను వినియోగిస్తున్నామని వెల్లడించారు.

వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ఆరెకపూడి గాంధీ సూచించారు. అలాగే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here