శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి రక్షించి, భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ప్రణాళికాబద్ధమైన నగరాన్ని అందించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. ఆక్రమణలు లేని నగరం – సురక్షితమైన భవిష్యత్తుకు పునాది అనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా సంస్థను ఏర్పాటు చేశారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పారామం ఎదురుగా ఉన్న తుమ్మిడి కుంట చెరువును మెట్టు సాయి కుమార్, జగదీశ్వర్ గౌడ్‌తో పాటు శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు సందర్శించి, హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ద్వారా చెరువులు, నాలాలు, ప్రజా ఆస్తులను పరిరక్షిస్తూ చట్టబద్ధమైన, సురక్షితమైన, ప్రణాళికాబద్ధమైన హైదరాబాద్ నిర్మాణానికి కృషి జరుగుతోందన్నారు. హైడ్రా అభివృద్ధికి అడ్డంకి కాదని, నగర అభివృద్ధికి బలమైన పునాది అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాలనీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.





