మొబైల్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు సీరియల్ నేరస్థుల అరెస్ట్..

శేరిలింగంపల్లి, జూలై 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బాలుడిని కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్ దోచుకున్న కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు సీరియల్ నేరస్థులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దోచుకున్న మొబైల్‌తో పాటు ఐదు చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 22న‌ రాత్రి 11.30 గంటల సమయంలో చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని హుడా కాలనీలో ఓ గుడిసెలో ఒంటరిగా ఉన్న జాన్ సయ్యద్ (16) వద్దకు నిందితులు ఉజర్ల విష్ణువర్ధన్ (21), దండుగుల భాను ప్రసాద్ (25) తాగునీరు కావాలంటూ వెళ్లారు. అనంతరం సమీపంలో మద్యం సేవించి తిరిగి వచ్చి కత్తితో బెదిరించి, ప్రతిఘటించిన‌ బాలుడిపై దాడి చేసి అతని రెడ్‌మీ నోట్ 11 ప్రొ మొబైల్ ఫోన్ ను దోచుకుని పరారయ్యారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు జూలై 23న చందానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 27న‌ ఉదయం పాపిరెడ్డి కాలనీలోని భాను ప్రసాద్ నివాసంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఈ దోపిడీతో పాటు సైబరాబాద్, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో నమోదైన మరో 10 ఆస్తి నేరాల్లో కూడా తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 11 కేసుల‌ను వీరు ఒప్పుకోవ‌డంతో ఛేదించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించిన రెడ్‌మీ నోట్ 11 ప్రో మొబైల్ ఫోన్, అలాగే బజాజ్ పల్సర్ 220, పల్సర్ 150, పల్సర్ ఎన్‌ఎస్160, కేటీఎం డ్యూక్ 200, యమహా ఫాసినో సహా మొత్తం ఐదు చోరీ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు ఉజర్ల విష్ణువర్ధన్‌పై గతంలో దొంగతనం, దోపిడీ, మహిళలపై నేరాలు, పోక్సో తదితర కేసులు సహా పలు కేసులు నమోదై ఉన్నట్లు, భాను ప్రసాద్‌పై కూడా దొంగతనం, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు సహా అనేక నేరాలు నమోదైనట్లు వెల్లడైంది. ఈ కేసును ఛేదించడంలో చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎ. శ్రీధర్ కుమార్, ఎస్‌ఐ కె. శ్రీనివాస తేజ, డిటెక్టివ్ క్రైమ్ సిబ్బంది కృషి చేశారని ఆర్సీ పురం డివిజన్ ఏసీపీ సీహెచ్‌.వై. శ్రీనివాస్ కుమార్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here