శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): గోపీనగర్‌లో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ స్థానిక ప్రజలతో కలిసి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రోడ్ నంబర్ 3, దుర్గామాత ఆలయ రోడ్డులో గత 20 రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతోపాటు, కొన్ని సందర్భాల్లో తాగునీటిలో మురుగునీరు కలుస్తోందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే డ్రైనేజీ లైన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో తరచూ మురుగునీరు రోడ్డుపై పొంగిపొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.

వినతిపత్రంపై స్పందించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజర్ శ్రీహరి కొత్త డ్రైనేజీ పైప్‌లైన్ పనులు పూర్తయ్యే వరకు వారానికి రెండుసార్లు డ్రైనేజీ లైన్‌ను శుభ్రం చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తాగునీటి సరఫరాను జూలై 28 నాటికి పూర్తిగా పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పొట్ట నరేందర్ యాదవ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు ప్రజల ప్రాథమిక హక్కులని పేర్కొన్నారు. గోపీనగర్ ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేస్తామని తెలిపారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలకు హామీ తీసుకురావడంపై గోపీనగర్ ప్రజలు పొట్ట నరేందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.





