శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి–యువజన ఉద్యమ విజయానికి నిదర్శనమని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అన్నారు. మియాపూర్‌లోని తాండ్ర రామచంద్రయ్య భవన్‌లో AIFDS గ్రేటర్ హైదరాబాద్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె మురళి, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ముత్యాలగారి శ్రీకాంత్ మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, విద్యాసంస్థల బంద్‌లు, ప్రజా చైతన్య కార్యక్రమాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, దేశ విద్యార్థి–యువజన ఉద్యమ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, అధికార అహంకారం ఎంత పెద్దదైనా యువత ఐక్య సంకల్పం ముందు తలవంచాల్సిందేనని ఈ పోరాటం నిరూపించిందన్నారు. ప్రజల సమస్యలు పార్లమెంట్‌లో వినిపించకపోతే ప్రతి వీధి, ప్రతి కళాశాల, ప్రతి మైదానం ప్రజల పార్లమెంట్‌గా మారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని వ్యాఖ్యానించారు. చరిత్రను మార్చేది అధికారం కాదని, పోరాడిన విద్యార్థులు, యువకులేనని పేర్కొన్న నాయకులు, ఈ విజయానికి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడి కృషే పునాదిగా నిలిచిందన్నారు. అయితే ఉద్యమం ఇక్కడితో ముగియదని, పారదర్శకమైన విద్యా వ్యవస్థ, పరీక్షల్లో అవకతవకలకు ముగింపు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, విద్యా వ్యవస్థలో జరిగిన లోపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గణేష్, ఈశ్వర్, తనీష్, రిషిక్, సాయి, వివేక్ తదితర నాయకులు పాల్గొన్నారు.





