శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల అపర్ణ సైబర్ కమ్యూన్ గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ప్రతి భారతీయుడిలో దేశభక్తి, సేవా తత్పరత, అభివృద్ధి పట్ల బాధ్యతను మరింత బలోపేతం చేసే సందేశాన్ని ఇచ్చారని అన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని, దేశ ప్రయోజనాలను సర్వోన్నతంగా భావించాలని మోదీ ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని ఘన నివాళులు అర్పించడం ద్వారా వారి త్యాగాన్ని చిరస్మరణీయంగా నిలిపారని, వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారని తెలిపారు. యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న విజయాలను ప్రధాని అభినందించడం ద్వారా వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత కీలక శక్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో స్వదేశీ ఉత్పత్తులు, స్వదేశీ సాంకేతికత, పరిశోధనలు, స్టార్టప్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారని, సమాజ సేవ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే బలమైన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందని వివరించారని చెప్పారు.
మోదీ నాయకత్వంలో సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ – సబ్ కా ప్రయత్న్ స్ఫూర్తితో దేశం అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని అందించిన సందేశాలను ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రతి పౌరుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు హనుమంత్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు విజయేందర్ సింగ్, డివిజన్ అధ్యక్షుడు శివా సింగ్, సీనియర్ నాయకుడు వసంత్ యాదవ్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ మహేష్, నాయకులు వెంకటస్వామి రెడ్డి, రాయల్, కిషన్ గౌలి, ప్రవీణ్, నాయకురాళ్లు వరలక్ష్మి, వినీత సింగ్, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.





