రంగారెడ్డి బీఓసీ జిల్లా అధ్యక్షుడిగా కంటే వెంకటస్వామి

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తానని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ (బీఓసీ) రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడు కంటే వెంకటస్వామి తెలిపారు. జిల్లా భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా కంటే వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా దాసరి ప్రసాద్ ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు చట్టబద్ధంగా లభించాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాద బీమా, పెన్షన్, విద్యా సహాయం, ప్రసూతి ప్రయోజనాలు, వైద్య సహాయం వంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కార్మికుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కార్మిక సంక్షేమ బోర్డులో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. అసంఘటిత రంగంలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ట్రేడ్ యూనియన్ ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని కంటే వెంకటస్వామి స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికులంతా ట్రేడ్ యూనియన్ జెండా కింద సంఘటితమై తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here