శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CUR) పరిధిలో ఇళ్లు లేని పేదలకు తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి సోమవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో రూపొందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, మహానగర హైదరాబాద్‌లో ఎల్‌ఐజీ (LIG) వర్గాల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామం నుంచి మహానగరం వరకు ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన సొంతింటిని అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1 లక్ష ఇళ్లు కలిపి మొత్తం 3.50 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. గత ఏడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో గూడు లేని ప్రతి అర్హ నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని, చివరి లబ్ధిదారుడి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను కూడా నిజం చేసేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు. ఇందుకోసం నగరంలోని కీలక ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి, అవసరాన్ని బట్టి ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు స్థలాలను సేకరించినట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో పది అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, సంబంధిత నియోజకవర్గ ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి, అంజయ్యనగర్ ప్రాంతాల్లో ఇప్పటికే 9 టవర్ల నిర్మాణం చేపట్టామని, మొత్తం 1,080 ఇళ్లను నిర్మించి అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేస్తామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఇది పేదలకు లభించిన సువర్ణ అవకాశమని అన్నారు.
క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో తొలి విడతగా 500 చొప్పున ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరుమీదనే అందజేసి వారికి సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళా సాధికారతకు బలమైన పునాది వేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశ చరిత్రలోనే పేదల సొంతింటి కలను సాకారం చేసిన చిరస్మరణీయ సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తుందని ఆరెకపూడి గాంధీ అన్నారు.





