శేరిలింగంపల్లి, జూలై 13 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు వివిధ విభాగాల అధికారులు శేరిలింగంపల్లి జోన్‌లోని అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ వార్డును సందర్శించి పౌర సమస్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా తులసివనంలో స్థానిక ప్రజలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్‌డబ్ల్యూఏ) ప్రతినిధులతో కమిషనర్ నేరుగా సమావేశమై వారి సమస్యలు, స్థానిక అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.

సీసీ రోడ్లు, యూజీడీ లైన్లు, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, నాలాల శుభ్రత, వీధి దీపాల మరమ్మత్తులు, పెండింగ్ పౌర పనులు, తులసివనం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, ఇంటింటి చెత్త సేకరణ, రహదారి ఆక్రమణలు, శ్మశానవాటిక అభివృద్ధి, కమ్యూనిటీ సదుపాయాలకు సంబంధించిన సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ప్రస్తావించిన అంశాలను పరిశీలించిన కమిషనర్, అత్యవసర పనులను ప్రాధాన్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వార్డు స్థాయి అవసరాల ఆధారంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వడమే వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.





