జూలై 24లోగా SIR ఫారం సమర్పించండి.. లేదంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి, సంతకం చేసి బూత్ లెవల్ అధికారులకు (BLO) తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. ఫారంలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత BLOలను సంప్రదించాలని తెలిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న గాంధీ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. జూలై 24 చివరి తేదీ కావడంతో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

SIR కార్యక్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నప్పటికీ, ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో అవగాహన లోపం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. BLOలు తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఫారాలు ఆలస్యంగా అందడం, గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాల్లోకి అనుమతి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, కాలనీ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులు కలిసి అవగాహన కల్పించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపడం మాత్రమే సరిపోదని, దానిని సంతకం చేసి BLOకు తిరిగి అందజేసినప్పుడే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తవుతుందని గాంధీ స్పష్టం చేశారు. ఫారం ఇవ్వని వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు.

భవిష్యత్తులో ఓటరు గుర్తింపు అనేక ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని పేర్కొంటూ, సంక్షేమ పథకాలు, రుణాలు, ఇతర సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. SIR ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం అందజేస్తారని, అదే BLO తిరిగి ఫారాన్ని స్వీకరిస్తారని తెలిపారు. ఈ దశలో ఎలాంటి ధ్రువపత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ తర్వాత ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేసిన పక్షంలో మాత్రమే గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్, విద్యా ధ్రువపత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, కుటుంబ నమోదు పత్రాలు, భూమి లేదా గృహ కేటాయింపు పత్రాలు తదితరాలను గుర్తింపు పత్రాలుగా పరిగణిస్తారని వివరించారు.

ఫారం సమర్పించే ముందు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాల‌ను ఆయ‌న వివ‌రించారు. ఫామ్‌కు తాజా ఫోటో అంటించాల‌ని, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ సరిగా నమోదు చేయాల‌ని, కుటుంబ వివరాలు పూర్తి చేయాల‌ని, అవసరమైతే 2002 SIR వివరాలు నమోదు చేయాల‌ని, ఫారంపై తప్పనిసరిగా సంతకం చేయాల‌ని, BLO నుంచి అక్‌నాలెడ్జ్‌మెంట్ (రసీదు) తీసుకోవాల‌ని, సమర్పించిన ఫారం, జత చేసిన పత్రాల ప్రతులను భద్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఎన్నికల సంఘం విడుదల చేసే అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని గాంధీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో AMC వహీద్ అలీ, BLOలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here