శేరిలింగంపల్లి, జూలై 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న SIR-2026 ప్రత్యేక గణన (Special Intensive Revision) ప్రక్రియ పురోగతిని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO) నారాయణ్ అమిత్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ తనిఖీలో నోడల్ అధికారులు, బీఎల్ఓ సూపర్‌వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు (BLOలు) పాల్గొన్నారు. గణన ప్రక్రియను పరిశీలించిన అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వేగాన్ని తగ్గించకుండా అదే ఉత్సాహంతో కొనసాగించాలని సూచించారు. నోడల్ అధికారులు, సూపర్‌వైజర్లు, బీఎల్ఓల మధ్య క్షేత్రస్థాయి సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని, నిర్ణీత గడువులోపు గణన ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని నారాయణ్ అమిత్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో జేపీ నగర్, దీప్తిశ్రీ నగర్, మాదాపూర్ ప్రాంతాలతోపాటు మై హోమ్ అబ్రా, ఫార్చ్యూన్ టవర్స్ ప్రాంతాలను కూడా సందర్శించి గణన పనుల పురోగతిని పరిశీలించారు.





