HCU కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై నెల రోజుల్లో చర్యలు.. లేబర్ కమిషనర్ హామీ..

శేరిలింగంప‌ల్లి, జూలై 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గత వారం రోజులుగా కొనసాగుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతు తెలిపింది. కార్మికుల సమస్యలపై లేబర్ కమిషనర్, యూనివర్సిటీ అధికారులతో జరిగిన చర్చల్లో నెల రోజుల్లో డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ లభించినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ తెలిపారు. కాంట్రాక్టర్ వేధింపులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, సమాన పనికి సమాన వేతనం తదితర 12 డిమాండ్ల సాధన కోసం హెచ్‌సీయూ కాంట్రాక్ట్ కార్మికులు వారం రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఈ అంశాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కేంద్ర కార్మిక శాఖతో చర్చించిన నేపథ్యంలో లేబర్ కమిషనర్ యూనివర్సిటీకి వచ్చి అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా హెచ్‌సీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను పరిరక్షించడం యూనివర్సిటీ బాధ్యత అని అన్నారు. లేబర్ కమిషనర్ సూచనల మేరకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, సమాన పనికి సమాన వేతనం, ప్రతి 20 రోజుల పనికి ఒక రోజు వేతనంతో కూడిన సెలవు, కాంట్రాక్టర్ దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట, ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికుడి కుటుంబ సభ్యుడికి ఉద్యోగ అవకాశం వంటి అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అలాగే కార్మికులు కలిసి ఒక సహకార సంఘం (సొసైటీ) ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో వారికే కాంట్రాక్ట్ వచ్చేలా ప్రయత్నిస్తామని అధికారులు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కార్మికులకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని రవికుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లేబర్ కమిషనర్ వికాస్, యూనివర్సిటీ అధికారులు, బీజేపీ మీడియా ప్యానలిస్ట్ మహేష్, లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, శ్రీకాంత్, హెచ్‌సీయూ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here