శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి నుంచి శంషీగూడ వరకు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న నూతన లింక్ రోడ్డు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.

ఎల్లమ్మబండ-శంషీగూడ లింక్ రోడ్డు పూర్తయితే ప్రజల ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ఇంధన ఆదా కూడా జరుగుతుందని గాంధీ తెలిపారు. ఈ రహదారి ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రాకపోకలకు దోహదపడుతుందని చెప్పారు. అలాగే వరద నీటి కాల్వ నిర్మాణం ద్వారా వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్డు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, ఎలాంటి రాజీ పడొద్దని గాంధీ స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ పునరుద్ఘాటించారు. ఆల్విన్ కాలనీ డివిజన్‌తోపాటు మొత్తం శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





