శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): ట్రాఫిక్ రహిత సమాజ నిర్మాణం కోసం రాజీలేని కృషి చేస్తామని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఉషముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారిపై చేపడుతున్న 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం, జలమండలి, ఎలక్ట్రికల్ శాఖ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఎల్లమ్మబండ రహదారిపై నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 100 ఫీట్ రోడ్డు విస్తరణను చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఉషముళ్లపూడి కమాన్ నుంచి సిక్కుల బస్తీ వరకు అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి సమస్యలను గుర్తించినట్లు గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు విస్తరణ సమయంలో దెబ్బతిన్న మంచినీటి పైప్‌లైన్‌ను వెంటనే పునరుద్ధరించినట్లు అధికారులు వివరించారు. అలాగే రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాల స్థానభ్రంశం, డివైడర్‌లలో సుందరీకరణ పనులు కూడా చేపట్టాలని సూచించారు. పనుల అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీ ఆదేశించారు. ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గడంతోపాటు ప్రజలకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నానని గాంధీ పునరుద్ఘాటించారు. ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ఈఈ గోవర్ధన్, ఏఈ సాయి యుగంధర్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, జలమండలి డీజీఎం శ్రీనివాస్ రాజు, ఎలక్ట్రికల్ డీఈ శ్యామ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.





