శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సూచించారు. భారీ వర్షాల కారణంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీతోపాటు మాదాపూర్‌లోని పలు కాలనీలు ముంపునకు గురికావడంతో ఆయన అర్థరాత్రి స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ముంపు ప్రాంతాలను సందర్శించిన గాంధీ కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మాన్‌సూన్ సిబ్బంది, ఎమర్జెన్సీ బృందాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలు వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలక్ట్రికల్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు లేదా తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని గాంధీ కోరారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అలాగే సీఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొన్నారు.
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ కోసం ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని గాంధీ సూచించారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దని, తడి చేతులతో స్విచ్‌బోర్డులు, మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు ఉపయోగించవద్దని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జ్‌ల వంటి పరికరాల స్విచ్‌లు ఆఫ్ చేయాలని, డిష్ కనెక్షన్లు తొలగించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ తెలిపారు.





