వర్షాకాల సన్నద్ధతపై సీఎంసీ ఫోకస్.. ఎల్‌ఆర్‌ఎస్, బిల్డ్‌నౌ, టీడీఆర్ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష..

శేరిలింగంప‌ల్లి, జూన్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సృజ‌న‌ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక, పౌరాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ), సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారం, బిల్డ్‌నౌ ద్వారా భవన నిర్మాణ అనుమతుల మంజూరు, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) దరఖాస్తులు, పెండింగ్ కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రహదారుల విస్తరణకు సంబంధించిన భూసేకరణ అంశాల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మాన్సూన్ సన్నద్ధత చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, సెల్లార్ తవ్వకాలు, అనధికారిక హోర్డింగ్‌లను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువుల్లో పరిష్కరించాలని, ప్రాధాన్యతా పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ అత్యవసర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. రహదారుల విస్తరణ, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాల పురోగతిని కూడా సమీక్షించిన కమిషనర్, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల్లో ఉన్న అడ్డంకులను అధిగమించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. సమర్థవంతమైన పట్టణ పాలనకు సమగ్ర ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్న కమిషనర్, పారదర్శకమైన ప్రజా కేంద్రిత పాలన ద్వారా మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సైబరాబాద్ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతోపాటు పట్టణ మౌలిక సదుపాయాల బలోపేతానికి కార్పొరేషన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here