శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించకుండా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో ఇన్స్పెక్టర్ ప్రశాంత్తోపాటు ఎస్సైలు హరి శంకర్, విఠల్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను ఆపి వారి వాహనాలను సీజ్ చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా 7 టూవీలర్ వాహనాలు, 6 త్రీ వీలర్ ఆటో రిక్షాలు మొత్తం కలిపి 13 వాహనాలను సీజ్ చేశామని, వాహనదారులపై ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు. వాహనాలను రాంగ్ సైడ్లో నడిపిస్తున్న వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






