శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): బలమూ, ధైర్యమూ, పరాక్రమానికి మారుపేరు హనుమాన్ అని, హనుమన్ జన్మోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అంజనీపుత్రుడైన హనుమంతుడి ఆశీర్వాదంతో ప్రజలకు సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. హనుమాన్ జన్మోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో బాపు నగర్, తారానగర్, గంగారాం హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే శోభయాత్రలో భాగంగా హుడా కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని శోభాయాత్రగా వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు నియోజకవర్గం పరిధిలోని అనేక హనుమాన్ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి శక్తికి విశ్వరూపం, రామభక్తికి ప్రతిరూపం ఆంజనేయుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులను స్వీకరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రామ భక్తుడైన హనుమంతుడు మహా శక్తిమంతుడని, సకల జనుల సంక్షేమం కోసం రాముడు చేసిన ధర్మయుద్ధంలో హనుమంతుడి పాత్ర ఎంతో కీలకం అని, అలాంటి హనుమ మన జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని అన్నారు.