జంట సర్కిళ్లలో అఖిల పక్ష సమావేశాలు

చందానగర్ సర్కిల్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశమైన డీసీ సుధాంశ్ ఇతర విభాగాల అధికారులు

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ నందగిరి సుధాంశ్, శేరిలింగంపల్లి ఉపకమీషనర్ వెంకన్న ల అధ్యక్షతన వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో ఆయా డివిజన్ల ఆర్ ఓలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు డివిజన్ల వారీ పోలింగ్ బూత్ ల జాబితాలను నాయకులకు అందజేశారు. పోలింగ్ బూత్ ల ఏర్పాటు, ఇతర సమస్యలపై పార్టీల నాయకుల సూచనలు, ఫిర్యాదులను స్వీకరించారు.

శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశమైన డీసీ వెంకన్న

ఒక డివిజన్ కు చెందిన పోలింగ్ బూతును మరో డివిజన్ ప్రాంతంలో ఏర్పాటు చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ బూతులను ఏర్పాటు చేయాలని, పోలింగ్ బూతులలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని పలువురు నాయకులు అధికారులను కోరారు. కాగా కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని, నోటిఫికేషన్ విడుదల లోపు ఓటరుగా నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలు తర్వాత విడుదల చేసే ఓటర్ల జాబితాలో ఉంటాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు నాయకులకు గల పలు సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల పరిధిలోని డివిజన్ల రిటర్నింగ్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here