శంకరన్ జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాలి.. తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మండల విద్యాధికారి కార్యాలయం స‌మీపంలో ఉన్న భవిత సెంటర్ లో శంకరన్ జయంతి కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ జిల్ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ భవిత సెంటర్ లో ఉన్న విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. అనంత‌రం రామ‌స్వామి యాద‌వ్ మాట్లాడుతూ శంకరన్ గా ప్రసిద్ధిచెందిన సిరిగలత్తూర్ రామనాధన్ శంకరన్ తమిళనాడులోని తంజావూరు జిల్లా సిరిగలత్తూరు గ్రామంలో 1934 అక్టోబర్ 22న జన్మించార‌ని, శంకరన్ తండ్రి రైల్వే గార్డుగా పనిచేసేవార‌ని అన్నారు.

విద్యార్థుల‌కు పండ్ల‌ను పంపిణీ చేస్తున్న దృశ్యం

పేదలు, దళితుల తరఫున గట్టిగా వాదనను వినిపించేవార‌ని, బొగ్గు గనులను జాతీయం చేయడంలోనూ, వెట్టి చాకిరీని నిర్మూలించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించార‌ని అన్నారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశార‌ని అన్నారు. నేటి యువ అధికారులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బాధ్యతాయుతంగా నీతి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజలకు సేవ చేసి సుపరిపాలనా దక్షులుగా నిలిచి ప్రజా అధికారులుగా జేజేలు అందుకోవాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో భవిత సెంటర్ అధ్యాపకురాలు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణీ సాంబశివరావు, శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, బాలన్న, కృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here