- 15న డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మొదటి దశ లో 11, 700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామని, ఈ నెల 21వ తేదీన రెండవ దశ లో దాదాపు మరో 13, 300 ఇండ్లను మరోసారి అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న రెండో దశ ఇండ్ల కేటాయింపు డ్రా తీయబడునని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని, పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర పథకమే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని చెప్పారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.