- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మంగళవారం రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలదరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రజలకు, కార్పొరేటర్లకు, డివిజన్ తెరాస అధ్యక్షులకు, వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ మెంబర్లకు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల కమిటీ మెంబర్లకు వీడియో సందేశం ఇచ్చారు.
వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం మంగళవారం రాత్రి సుమారుగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కనుక లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అవసరం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించాలని, ఫంక్షన్ హాల్స్ ను వాడుకోవాలని, అపార్ట్మెంట్ల మీదకు తరలించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు భోజన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు అందరూ సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, అవసరం అయితే తమను గానీ, తమ కార్యాలయ సిబ్బందిని గానీ, సంబంధిత అధికారులను గానీ సంప్రదించాలని సూచించారు.