నమస్తే శేరిలింగంపల్లి: పారిశుధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. చందానగర్ మున్సిపల్ కార్యాలయం శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బందితో చందానగర్ డివిజన్ లోని పీజేఆర్ స్టేడియంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లోని ప్రతి కాలనీలో పారిశుధ్యం పనులు సక్రమంగా నిర్వహించాలని, స్వచ్ ఆటోలు ప్రతి రోజూ ప్రతి కాలనీకి వెళ్లి చెత్త సేకరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చెత్తను ఆటోల్లో తరలించే సమయంలో రోడ్లపై, కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ పడకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని ప్రతి రోజు వారి పై అధికారులతో పర్యవేక్షణ ఉంచాలని కోరారు. పారిశుధ్య సమస్యపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తిక్, శ్రీనివాస్ రెడ్డి, పారిశుధ్య కార్మికులు, ఎస్ ఆర్ పీలు, ఎస్ ఎఫ్ ఏ లు, టీఆర్ఎస్ నాయకులు వరలక్ష్మి రెడ్డి, నరేందర్ భల్లా తదితరులు పాల్గొన్నారు.