నమస్తే శేరిలింగంపల్లి: విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధ సంఘం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం గచ్చిబౌలిలోని డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు లెనిన్, సీఐటీయూ శేరిలింగంపల్లి నాయకులు కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ లోని ప్రతి ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నేటికి నెరవలేదన్నారు. కార్మికులపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిందని ప్రతి సబ్ స్టేషన్ లో నలుగురు ఆర్టిజన్ లో ఉండాలని కానీ ఇప్పటికీ ఒకరితోనే ఉద్యోగం చేయిస్తున్నారని వాపోయారు. ఇప్పుడు ఏమైనా పని భారంతో పాటు ఎలాంటి చదువు లేకుండా ఎమర్జెన్సీ సర్వీస్ లో పనిచేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని శాశ్వతంగా నియమించకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.