నమస్తే శేరిలింగంపల్లి: దశల వారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడు అని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారుల ఎంపిక చేసినట్లు చెప్పారు. దళిత బంధు పథకం ద్వారా మంజూరైన పది లక్షల రూపాయలతో అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నిండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోజేశ్, మాచర్ల భద్రయ్య, ఎండీ ఇబ్రహీం, రాజేష్, అర్జున్, అంజలి తదితరులు పాల్గొన్నారు.