నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ప్రక్కన గల ఎలక్ట్రికల్ ఏడీఈ కార్యాలయం ఎదుట బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పెరిగిన నిత్యావరసర ధరలు, ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కరెంట్ చార్జీల పెంపు సరికాదన్నారు. గత రెండేళ్లుగా కరోనాతో ఉపాధి లేక, ఉన్న ఉద్యోగాలు పోయి భారంగా జీవిస్తున్న తరుణంలో విద్యుత్ చార్జీల పెంపు పట్ల ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ఇప్పుడు ఆ భారాన్ని జనంపై మోపుతోందన్నారు. ఇంతకు ముందు కరెంట్ తీగను ముట్టుకుంటే షాక్ కొట్టేది, కేసీఆర్ పాలనలో కరెంట్ బిల్లును ముట్టుకుంటే షాక్ కొడుతోందని ఎద్దేవా చేశారు. పెంచిన విద్యుత్ చార్జీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జిల్లా నాయకులు బుచ్చి రెడ్డి, మూల అనిల్ గౌడ్, మారం వెంకట్, డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, హరికృష్ణ, కృష్ణ, శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు కాంచన కృష్ణ, మహిపాల్ రెడ్డి, మనోహర్, రాఘవేందర్ రావు, ఎల్లేష్, కసిరెడ్డి సింధు, మహేష్ యాదవ్, రవి గౌడ్, హరిప్రియ, మహిళా నాయకురాళ్లు పద్మ, వరలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.