నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఓంకార్ ఆశయ సాధనతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారాం నాయక్ పేర్కొన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధులు, ఎంసీపీఐయూ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 13వ వర్ధంతిని పురస్కరించుకుని స్టాలిన్ నగర్ లో ఎన్. గణేష్ అధ్యక్షతన వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ హాజరై ఓంకార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 31 వరకు “ప్రస్తుత రాజకీయాలు వామపక్షాల-సామాజిక శక్తుల కర్తవ్యం” అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఓంకార్ స్మారక పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత రాజకీయాలను అంచనా వేసి వామపక్షాల ఐక్యత, సామాజిక శక్తులు ఐక్యతతో దేశంలో ప్రజా సమస్యలు, మతోన్మాదం, తదితర అంశాలపై విశాల పోరాటాన్ని నిర్మాణం చేసేందుకు ఈ పదిహేను రోజులు రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు, సదస్సులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ కమ్యూనిస్టుల ఐక్యత ను కోరారని అన్నారు. ఓంకార్ ఆశయ స్ఫూర్తితో మరిన్ని ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీ వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్,యూపీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం. రమేష్, ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, ఏఐఎఫ్ డీ డబ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పుష్ప, పి భాగ్యమ్మ, ఎం రాణి, లావణ్య, లక్ష్మి, రామయ్య, మాధవరావు, శంకర్, స్టాలిన్ సాగర్ వి. రాము తదిదితరులు పాల్గొన్నారు.