నమస్తే శేరిలింగంపల్లి: మహిళలపై, పసి పిల్లల పై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఎన్ని చట్టాలు తెచ్చినా ఎలాంటి ఉపయోగం లేదని ఏఐఎఫ్ డీడబ్ల్యు రాష్ట్ర కమిటీ సభ్యులు విమల ఎద్దేవా చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ బుధవారం మియాపూర్ ఆల్విన్ కాలనీలో మహిళలతో కలిసి నిరసన రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ గుడిలో, బడిలో, రోడ్లపై చివరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రతిచోట మహిళలపై అడ్డగోలుగా అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం సిగ్గుచేటన్నారు. ఇంత జరుగుతున్నా అధికార ప్రతిపక్ష నాయకులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించక పోవడం బాధాకరం అన్నారు. దిశ హత్య కేసులో పార్లమెంటులో సైతం మాట్లాడిన రేవంత్ రెడ్డి స్పందించిన అధికార పార్టీ దాని తర్వాత జరిగిన వందల సంఖ్యలో అత్యాచారాల మీద ఎలాంటి ఖచ్చితమైన ప్రతిఘటన చర్యలు చేపట్టినట్టు కనిపించడం లేదన్నారు. ఉన్నత వర్గాల వారికి అన్యాయం జరిగితే ఒకలా పేద ప్రజలకు అన్యాయం జరిగితే మరోలా అన్నట్టు నాయకుల పనితీరు కనిపిస్తున్నదని అన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు గుంటూరులో రమ్యపై జరిగిన హత్య యావత్ దేశానికి సిగ్గుచేటన్నారు. రమ్య ఉదంతం మరవకముందే గాంధీ హాస్పిటల్ లో అక్కాచెల్లెళ్లపై ఆస్పత్రి సిబ్బంది మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడం దారుణమన్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్న వారిని వెంటనే ఉరిశిక్ష వేయాలని విమల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మహిళా సంఘం నాయకులు ఇంద్ర, ఈశ్వరమ్మ, విమల, లక్ష్మీ, లావణ్య, సుల్తానా బేగం, అమీనా బేగం, శివాని తదితరులు పాల్గొన్నారు.