- మదీనాగూడ అర్చన హాస్పిటల్ తీరుపై బాధితుడి ఆవేదన
- మియాపూర్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ పాజిటివ్‌గా తేలిన తన తండ్రిని ఎలాగైనా బ్రతికించుకోవాలని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు బిహెచ్ఇల్ ఉద్యోగి ప్రమోద్. దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి 14 రోజుల పాటు వైద్యం అందించిన అనంతరం ఆనారోగ్యం నుండి కోలుకుని సాధారణ స్థితికి రావడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో కరోనా నుండి కోలుకున్న తన తండ్రి చావుకు కారణమయ్యారని ఆవేదన చెందుతున్నాడు బాధితుడు. ఆసుపత్రి నిర్లక్ష్య వైఖరిపై ప్రమోద్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వీడియో శేరిలింగంపల్లిలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే…

కెపిహెచ్‌బి కాలనీ ఫేజ్ 3 కి చెందిన బిహెచ్ఇఎల్ ఉద్యోగి ప్రమోద్ తండ్రి శంకర్‌పవార్(57)కు గత నెల 11వ తేదీన కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో ఏప్రిల్ 19వ తేదీన మదీనాగూడలోని అర్చన ఆసుపత్రిలో చేర్చారు. 26వ తేదీ రోగి ఆరోగ్యం క్షీణించడంతో ఎంఐసియులో ఉంచి వైద్యం చేశారు వైద్యులు. మే 3వ తేదీలోగా శంకర్‌పవార్ పూర్తిగా కోలుకోవడంతో ఆక్సీజన్‌పై ఉంచి వైద్యసేవలు కొనసాగించారు. అయితే 4వ తేదీన రాత్రి ప్రమోద్ తన తండ్రితో మాట్లాడగా తనకు ఆకలేస్తుందని భోజనం చేస్తానని అడిగాడని, ఈ విషయమై డాక్టర్లను అడగగా రేపటి నుండి భోజనం అందించవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో తాను భోజనం చేసేందుకు ఆసుపత్రి బయటకు వెళ్లి వచ్చే సరికి ఎంఐసియులో నర్సింగ్ సిబ్బంది ఒక్కరు కూడా లేరని, తన తండ్రికి ఆక్సీజన్ మాస్క్ తొలగిపోయి ఉండటంతో పాటు పల్స్ రేట్ వేగంగా పడిపోవడం గమనించినట్లు తెలిపారు. బయట ఉన్న సిబ్బందిని ప్రశ్నించగా తనను అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పారని, అప్పటికే పల్స్ రేట్ 0 అవ్వడంతో డ్యూటీ డాక్టర్ వచ్చి తన తండ్రికి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో మృతిచెందినట్లు తెలిపారన్నాడు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే కరోనా నుండి కోలుకున్న తన తండ్రి కన్నుమూశాడని ప్రమోద్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తాను మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరాడు. కరోనా రోగుల పట్ల ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు తెలియజెప్పేందుకే తాను సోషల్ మీడియా ద్వారా వీడియోలో తన బాధను పంచుకున్నట్లు ప్రమోద్ తెలిపాడు.





