శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీకి చెందిన భరత్ రావుకి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుండి రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయం మంజూరైంది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న అనంతరం, సిఎంఆర్‌ఎఫ్ – ఎల్‌ఓసీ (CMRF–LOC) ద్వారా ఈ మొత్తం మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన మంజూరి పత్రాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబ సభ్యులకు అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సకు ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక భరోసాగా నిలుస్తోందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆపన్న హస్తంలా సహాయపడుతోందని అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీకి చెందిన శ్రీ భరత్ రావుకి అత్యవసర చికిత్స అవసరమై సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేయగా, దాన్ని సానుకూలంగా పరిశీలించి రూ.2.50 లక్షల సహాయం మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అన్వర్ షరీఫ్, దామోదర్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, సత్యనారాయణ, బ్రిక్ శ్రీనివాస్, అనిల్ కావూరి తదితరులు పాల్గొన్నారు.





