నమస్తే శేరిలింగంపల్లి: సగరులను గుర్తించి జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా చంఢూర్ మండల పరిధిలోని చామలపల్లి గ్రామంలో సగర కుల జనగణన పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సగరులను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ సగర కులస్తులకు ప్రాధాన్యత కల్పించకపోవడంతో మరింత వెనుకబాటుతనానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో సగర కులస్తులకు సంబంధించి జనగణన ప్రభుత్వం దగ్గర లేకపోవడం దుర్మార్గమన్నారు.ప్రభుత్వం చేతగానితనం వల్లే సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనగణన చేపట్టామన్నారు. పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఓ నివేదికతో తమ జనాభ నిష్పత్తి ఎంత ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు సగర కులస్తులకు ప్రాధాన్యత ఇచ్చి చట్టసభల్లో సీట్లు కేటాయించాలని శేఖర్ సగర డిమాండ్ చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా చతికిలపడ్డ తమని రాష్ట్రంలో పాలకుల పుణ్యమా అంటూ బిసి ‘డి’ లో కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.1974, 1986 సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనంత రామన్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ ‘ఏ’ లోకి మార్చారన్నారు. ఆర్థిక, రాజకీయ సమానత్వమే తమ లక్ష్యమని ప్రకటనలు చేస్తున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక మాట మార్చి రాజకీయ ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి బిక్షపతి సగర, జిల్లా అధ్యక్షులు సందుపట్ల లక్ష్మణ్ సగర, రాష్ట్ర సగర మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి సగర, ప్రధాన కార్యదర్శి శ్రవంతి సగర, వైఎస్సార్ పార్టీ నాయకురాలు అమృత సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి రాము సగర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నేర్లకంటి రవికుమార్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సగర, కోశాధికారి దయా సాగర్, నాయకులు కళ్లెట్ల మారయ్య సగర, చామనపల్లి సంఘం అధ్యక్షులు శంకర్ సగర, యువజన సంఘం నాయకులు సీతారాం సగర తదితరులు పాల్గొన్నారు.