పెద్ద‌ల నిర్మాణాల‌ను వ‌దిలి పేద‌ల ఇళ్ల‌పై HMDA అధికారుల ప్ర‌తాపం

  • ఎంఏ న‌గర్‌లో పేద‌ల గుడిసెలు తొల‌గింపు
  • ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన వ్య‌క్తి, ప‌రిస్థితి విషమం
  • బడాబాబుల‌కు కొమ్ము కాస్తున్నార‌ని స్థానికుల ఆరోప‌ణ‌
  • న్యాయం చేయాల‌ని డిమాండ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌భుత్వం మారితేన‌న్నా త‌మ రాత మారుతుందేమోన‌ని, త‌మ భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని ఆశించి కొత్త ప్ర‌భుత్వాన్ని ఎన్నుకుంటున్నా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారికి మాత్రం నిరాశే మిగులుతోంది. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా కేవ‌లం బ‌డాబాబుల‌కే కొమ్ము కాస్తుందంటూ మ‌రోమారు నిరూపిత‌మైంది. కేవ‌లం పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు క‌ట్టుకున్న నిర్మాణాల‌నే కూల్చివేస్తున్న అధికారులు బ‌డాబాబుల నిర్మాణాల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. ఇందుకు తాజాగా హైడ్రా, హెచ్ఎండీఏ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని చెప్ప‌వ‌చ్చు.

గుడిసె తొల‌గింపుతో రోడ్డున ప‌డ్డ దుర్గ‌య్య కుటుంబం

ఆత్మ‌హ‌త్య‌కు వ్య‌క్తి య‌త్నం, ప‌రిస్థితి విష‌మం..

శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ డివిజన్ ఎంఏ నగర్ లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు హెచ్ఎండీఏ అధికారులు గతంలోనే నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో శనివారం ఎంఏ నగర్ లో కూల్చివేతలు చేపట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు సిబ్బందితో కలిసి ఎంఏ నగర్ కు చేరుకున్నారు. కాగా కూల్చివేతలు చేపట్టకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే తమ ఇళ్ల జోలికి వస్తున్నారని ఆక్షేపిస్తూ దుర్గయ్య అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అది గమనించి అత‌న్ని వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుర్గయ్య పరిస్థితి విషమంగా ఉందని, హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడ‌ని కుటుంబ సభ్యులు తెలిపారు.

హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న దుర్గ‌య్య

పెద్ద‌ల‌ను వ‌దిలి పేద‌ల‌పై ప్ర‌తాపం..

కాగా ఎంఏ నగర్ లో ప్రభుత్వ స్థలాల్లో వెల‌సిన నిర్మాణాలను కూల్చేందుకు హెచ్ఎండీఏ అధికారులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం హెచ్ఎండీఏ అధికారులు మరోసారి కూల్చివేతలకు సిద్ధమయ్యారు. అయితే ఎంఏ నగర్ కూల్చివేతలపై స్థానికుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు కొందరికి కొమ్ము కాస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కేవ‌లం పేద‌, సామాన్య ప్ర‌జ‌ల నిర్మాణాల‌నే కూల్చివేస్తున్నార‌ని, బ‌డాబాబుల నిర్మాణాల వైపు చూడ‌డం లేద‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాము పైసా పైసా కూడ‌బెట్టి క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ముతో నిర్మాణాన్ని నిర్మించుకుంటే అధికారులు అస‌లు త‌మ గోడును ప‌ట్టించుకోకుండా కూల్చివేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం, అధికారులు మేల్కొని త‌మ‌లాంటి పేద‌ల‌పై ప్ర‌తాపం చూప‌డం మాని బ‌డాబాబుల నిర్మాణాల‌ను కూల్చివేయాల‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

దుర్గ‌య్య (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here