నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి బసవతారక నగర్ సర్వే నెంబర్ 37లో 30 ఏళ్లుగా స్థానికంగా గుడిసెలు, షెడ్లు వేసుకుని జీవిస్తున్న 250 కి పైగా పేద కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ వాపోయారు. ముందస్తుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 500 వందల మంది పోలీసు బలగాల సహాయంతో రెవెన్యూ అధికారులు పదిహేను జేసీబీలతో వెళ్లి ఇళ్లను నేలమట్టం చేయడం దారుణమని అన్నారు. కూల్చివేతలను ఆపాలని స్థానిక కార్పొరేటర్ గంగాధర్, హనుమంతు నాయక్, బిజెపి నాయకులు ఆర్డీఓతో మాట్లాడుతుండగా అధికార పార్టీ అండదండలు చూసుకొని పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టు చేయడాన్ని రవి కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఎక్కడైనా ఇల్లు కూల్చేటప్పుడు ముందస్తు నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ మద్దతు ఉందని చెప్పి ఇలాంటి ఉన్మాద చర్యలకు దిగడం సరికాదన్నారు. ఇక్కడ నివసించే వారు ప్రభుత్వానికి పన్ను కడుతున్నారని, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారని అన్నారు. ఏ ఉద్దేశంతో ఇళ్లను కూల్చివేస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు ఇంత అన్యాయమా అని వాపోయారు. ఇక్కడ ఇండ్లు ఖాళీ చేయించి ఎవరికి కట్టబెట్టాలని చూస్తున్నారని, మీ బినామీలకా, మీ పుత్రుడికా, మీ నాయకులుకా అని రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు.