శేరిలింగంపల్లి, అక్టోబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రస్తుత పరిస్థితులలో వ్యవస్థ నిర్మూలన వర్గ, సామాజిక జమిలి పోరాటాలతోనే సాధ్యం అని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. మియాపూర్ యంఏ నగర్ లో జరిగిన యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దేశంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రస్తుత పరిస్థితులు కార్పొరేట్ పెట్టుబడిదారుల ఆర్థిక అనుకుల విధానాలతోపాటు కుల, మత తత్వాలు మరింత బలపడే విధంగా ఉన్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి తన మతతత్వ విధానాలతోపాటు కార్పొరేట్ అనుకూల విధానాలను బలపరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ముకాస్తూ పాలిస్తుందని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ సంక్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని వ్యవసాయ విధాన అభివృద్ధి కోసం మాటలకే పరిమితమై పనిచేస్తున్నాయని అన్నారు. పేద సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ఉచిత పథకాలతో మోసగిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాల వలన ప్రస్తుతం ఉన్న సమాజం ప్రజలకు అనుకూలంగా లేదని, కార్పొరేట్ అనుకూల విధానాలు బలపడుతూనే ప్రజల మధ్య కుల మత బేధాలు ఎంతో బలపడుతున్నాయని అన్నారు. వీటికి వ్యతిరేకంగా వర్గ పోరాటాలు అలాగే సామాజిక పోరాటాలు జమిలిగా జరిగి ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మార్పు కోసం పోరాటాలు నిర్వహించాలని అదే కర్తవ్యంగా పనిచేస్తుందని అన్నారు. తాము నిర్వహించే వర్గ సామాజిక పోరాటాలలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులై జయప్రదం చేయాలని కోరారు. కర్ర దానయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు కుంభం సుకన్య, వి.తుకారాం, ఇస్లావత్ దశరథ్ నాయక్, అంగడి పుష్ప, తాండ్ర కళావతి, బి విమల, ఎం యాదగిరి, ఎంవై కుమార్, డి మధుసూదన్, బి కె నారాయణ, ఎండి నజీర్, కన్నా శ్రీనివాస్, పి శ్యాంసుందర్, యార్లగడ్డ రాంబాబు పాల్గొన్నారు.