నమస్తే శేరిలింగంపల్లి: దీప్తీశ్రీనగర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఆషాడ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్షేత్రంలోని అమ్మవారు విజయదుర్గాదేవి శాఖాంబరి దేవీగా దర్శనమిచ్చారు. పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. భక్తుల ఆటపాటలతో, కోలాటాలతో ఆలయ ప్రాంగణం కోలాహలంతో నిండిపోయింది.
ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలలో బోనాల వేడుకకి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక స్థానమన్నారు. గ్రామదేవతలను ఆరాదించుకునే ఈ ఉత్సవాలను ధర్మపురి క్షేత్రంలో మూడు దశాబ్ధాలుగా కొనసాగిస్తున్నామని అన్నారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను ఆదరించడం, గౌరవించడం, మర్యాద చేయడం అనే సంప్రదాయాన్ని తెలిపే సాంప్రదాయ పండుగ బోనాలు అన్నారు. అమ్మవారిని వేడుకుని, ఆడపిల్లల్ని గౌరవంగా, మర్యాదగా చూసుకుని ఆ తల్లి ఆశీస్సులు పొందాలన్నారు.