నమస్తే శేరిలింగంపల్లి: గుంతలమయమైన రోడ్లతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల నుంచి ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లైనా లేదని బిజెపి నాయకులు మండిపడ్డారు. చందానగర్ డివిజన్ లో ఉన్న నేషనల్ హైవే భవాని హార్డ్ వేర్ షాప్ నుండి బిక్షపతి ఎన్ క్లేవ్ వరకు గల మెయిన్ రోడ్డును శేరిలింగంపల్లి బిజెపి నాయకులు పరిశీలించారు. మెయిన్ రోడ్ పూర్తిగా గుంతలమయమై, బురద నీటితో ఉండడంతో స్కూల్ పిల్లలకు, కాలనీ వాసులకు, వాహనదారులకు నడవలేని స్థితిలో ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. కాంట్రాక్టర్లు పైప్ లైన్ వేసి కనీసం గుంతలు కూడా పూడ్చకుండా వదిలివేసి వెళ్లడంతో రోడ్లు వేసేందుకు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారుల సమన్వయం లోపంతో సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని వాపోయారు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోక స్కూల్ పిల్లలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్డు వేసి ప్రజా ఇబ్బందులను తీర్చాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి రోడ్డు పై ధర్నా చేస్తామని బిజెపి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్జల యోగానంద్, మువ్వ సత్యనారాయణ, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, కాంచన, విజయ్ లక్ష్మీ, హరి కృష్ణ, రాకేష్ దూబే, శ్రీనివాస్ రెడ్డి, శివ కుమార్ వర్మ, పి. శ్రీనివాస్, శోభ దూబే, గౌస్, పోచయ్య, రాజు శెట్టి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.