శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద ఉన్న చందానగర్ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని నియోజకవర్గం సీనియర్ నాయకుడు వాలా హరీష్ రావు డిమాండ్ చేశారు. చందానగర్ నుంచి పటాన్‌చెరు, మెహిదిపట్నం వైపు వెళ్లే జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కారణంగా వాహనదారులకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఫ్లై ఓవర్‌ను నిర్మించడం వల్ల ట్రాఫిక్ అవస్థలు తప్పుతాయని అయితే ఫ్లై ఓవర్‌కు మాత్రం పీవీ లేదా జయశంకర్ పేరును పెట్టాలని అన్నారు. తెలంగాణకు వారు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆ మహానుభావులను ఈ విధంగానైనా భవిష్యత్ తరం వారు గుర్తుంచుకోవాలంటే వారి పేర్లను ఫ్లై ఓవర్‌కు పెట్టాలని అన్నారు. రాజీవ్ గాంధీ, నెహ్రూ వంటి పేర్లను పెడితే సహించేది లేదన్నారు.