శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న వెన్నెముక ఆరోగ్యం ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి, వెన్నెముక ఆరోగ్యం తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడిందని అన్నారు. దీర్ఘకాలిక వెన్నునొప్పి తగ్గడం కోసం సరైన భంగిమ, వివిధ స్థాయిలలో గాయాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వెన్నునొప్పి, వెన్నెముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నామని తెలిపారు. సరైన భంగిమ, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం, నిద్రతో వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు.