నమస్తే శేరిలింగంపల్లి:వరి సాగు చేయొద్దంటూ, వరి వేస్తే ఉరే అంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ వాపోయారు. వరి వేయొద్దంటూ ఆంక్షలు విధిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో బిజెపి నాయకులతో కలసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ నుంచి తప్పించుకునే కుట్రలో భాగమే వరి సాగుపై ఆంక్షలు విధించడమని ఆయన అన్నారు. వరి పండించే రైతులు కలెక్టర్లకు గంజాయి సాగుదార్ల మాదిరి కనపడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. తరతరాలుగా సాంప్రదాయకంగా వరి మాత్రమే సాగు చేస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించకుండా హఠాత్తుగా ఆంక్షలు విధిస్తే సహించేది లేదన్నారు. గత ఏడు సంవత్సరాలుగా ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కొనుగోలు చేస్తున్నారని, ఉచిత విద్యుత్ హామీ నుంచి తప్పించుకోవడం కోసమే ఇప్పుడు కెసిఆర్ ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. వరి సాగు చేసే రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణలో ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు రవి గౌడ్, బాబు రెడ్డి, శివ, నవీన్,రమేష్ బాబు, మల్లేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.