నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరంలో నేటికీ నీటి సమస్య తీరలేదని, ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ అన్నారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద బిజెపి నాయకులు ధర్నా చేపట్టారు. మంచినీటి, సీవరేజ్ సమస్యలపై ఆందోళన చేపట్టిన బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ శివారులో ఇప్పటివరకు త్రాగునీరు అందడం లేదని అన్నారు. ఆడపిల్ల బిందె పట్టుకొని నీటి కోసం బయటికిరాకుండా ఇంటికో నల్లా బిగించి నీరు అందిస్తామని చెప్పిన కెసిఆర్ పేద ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోయారు. మంజీరా, డ్రైనేజీ నీరు కలుషితమై వందలాది మంది ప్రజలు అస్వస్థకు గురవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాబోయే వంద సంవత్సరాల వరకు నీటి సమస్య ఉండదని అసెంబ్లీలో ప్రగల్బాలు పలకడం హేయనీయం అన్నారు. తక్షణమే హైదరాబాద్ మహానగరంలో కలుషిత నీరు త్రాగి మరణించిన, అస్వస్థకు గురైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని ఆర్థికసాయం అందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.