నమస్తే శేరిలింగంపల్లి: తొలిసారిగా ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము భారీ విజయం సాధించడం పట్ల బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ద్రౌపదీ ముర్ము తన రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించి, శాసన సభ్యురాలిగా, మంత్రిగా, పార్టీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలి స్థాయి నుంచి అంచలంచెలుగా రాష్ట్రపతి వరకు ఎదగడం గొప్ప విషయం అన్నారు. ఇలాంటివి భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. ఒక ఆదివాసీ గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నరేంద్రమోడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గిరిజనులను, ఆదివాసీలను గుర్తించి రాష్ట్రపతి లాంటి ఉన్నత స్థానాన్ని కల్పించిన ఏకైక పార్టీ గా భారతీయ జనతా పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.