గచ్చిబౌలి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): సగర జాతికి వెలకట్టలేని సేవలందించిన గిన్నె భీమయ్య సగర చిరస్మరణీయుడు అని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ, శ్రీ యాదాద్రి భగీరథ సగర ఉప్పర అన్నదాన సత్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల అకాల మరణం చెందిన గిన్నె భీమయ్య సగర సంస్మరణ సభను సోమవారం గచ్చిబౌలిలోని రాష్ట్ర సగర సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమయ్య సగర చిత్రపటానికి పూలమాలలు వేసి సగర సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, అన్నదాన సత్రం నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గిన్నె భీమయ్య సగర సేవలను స్మరించుకొని సంఘం నాయకులు మాట్లాడారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా సగర కులానికి అనేక హోదాలలో సేవలందించిన గిన్నె భీమయ్య సగర లేని లోటు సగరులకు తీరనిది అని అన్నారు. జగద్గిరిగుట్ట సగర సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన గిన్నె భీమయ్య సగర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోశాధికారిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేయడం, శ్రీశైల అన్నదాన సత్రం అభివృద్ధికి కృషి చేయడంతోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో సగర అన్నదాన సత్ర నిర్మాణానికి సంకల్పించి వ్యవస్థాపక అధ్యక్షులుగా చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
గిన్నె భీమయ్య సగర కులానికి చేసిన సేవలు నేడు సగర కుల నాయకులకు ఆదర్శమని కొనియాడారు. భీమయ్య సగర ఆశయ సాధన కోసం భవిష్యత్తులో సగర కులాన్ని సంఘటిత పరిచి ఉన్నత శిఖరాల వైపు తీసుకుపోయే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని పిలుపునిచ్చారు. గిన్నె భీమయ్య సగర స్మారకార్థం యాదాద్రిలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రంలో చిరస్థాయిగా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బంగారు నరసింహ సగర మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా కుటుంబం కంటే సగర కులానికే అధిక సమయం కేటాయించిన గొప్ప నాయకుడు గిన్నె భీమయ్య సగర అని కొనియాడారు.
యాదాద్రి సగర అన్నదాన సత్ర సంఘం అధ్యక్షుడు కేపీ రాములు సగర మాట్లాడుతూ తన మదిలో నుంచి వచ్చిన యాదాద్రి సత్రం నిర్మాణం తొందరలోనే పూర్తి చేసి ఆయన కన్న కలలు నిజం చేస్తామని తెలిపారు. రాష్ట్ర సంఘం ముఖ్య సలహాదారు ఆర్.బి ఆంజనేయులు సగర మాట్లాడుతూ గొప్ప వ్యక్తిత్వంతోపాటు సంఘ సేవలో ముందున్న భీమయ్య సగర అనేకమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
యాదాద్రి సగర అన్నదాన సత్రం అధ్యక్షుడు కె.పి రాములు సగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భీమయ్య సగర కుటుంబ సభ్యులతో పాటు సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమార స్వామి సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ నాయకులు డాక్టర్ గిడ్డన్న సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద బుద్ధుల సతీష్ సగర, చిలుక శ్రీనివాస్ సగర, శేఖర్ సగర, మోడల్ ఆంజనేయులు సగర, వెంకటయ్య సగర, బుడ్డన్న సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, శ్రీనివాస్ సగర, అర్జున్ సగర, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్ రాములు సగర, కోశాధికారి దిండి రామస్వామి సగర, యువజన సంఘం గ్రేటర్ అధ్యక్షుడు సీతారాం సగర, గ్రేటర్ నాయకులు శ్రీరాములు సగర, రామకృష్ణ సగర, యాదాద్రి అన్నదాన సత్రం కోశాధికారి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాదంశెట్టి కృష్ణ సగర, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు నరసింహ సగర, అంజయ్య నగర్ సంఘం అధ్యక్షుడు నరసింహ సగర, జగద్గిరిగుట్ట సగర సంఘం అధ్యక్షుడు కొండయ్య సగర, రాష్ట్ర సంఘం నాయకులతోపాటు వివిధ జిల్లాల నాయకులు, ప్రాంతీయ సంఘాల నాయకులు, యాదాద్రి సత్రం దాతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.