నమస్తే శేరిలింగంపల్లి: వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భేరి రాంచందర్ యాదవ్ పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని కుల సంఘాలు కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. వీఆర్ఏలు ప్రతి గ్రామంలో అన్ని రకాల శాఖలకు సమన్వయంతో పని చేస్తారన్నారు. పెరుగుతున్న ధరలకు ప్రభుత్వం చెల్లిస్తున్న చాలీచాలనీ వేతనాలతో వీఆర్ఏలు ఎన్నో ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారంగా మారే దుస్థితి నెలకొందన్నారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, జిల్లా జేఏసీ కో కన్వీనర్ ఆంజనేయులు, వీఆర్ఏలు సంతోష్, జంగయ్య ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.