శేరిలింగంపల్లి, అక్టోబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో హఫీజ్‌పేట డివిజన్ కార్పొరేటర్ పూజిత, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగు రంగుల పుష్పాలతో పేర్చిన బతుకమ్మలను అంగరంగ వైభవంగా తీసుకువచ్చి ఒక్క చోట చేర్చి బతుకమ్మలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఉత్తమ బతుకమ్మ, లక్కీ డ్రా విజేతలకు సైబరాబాద్ షీ టీమ్స్ సీఐ సునీత, ఆర్య వైశ్య చైర్మన్ కాల్వ సుజాత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
